వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునేదెలా

జాతకచక్రము పరిశీలించునప్పుడు జాతకంలో పెళ్లి తొందరగా జరుగుతుందా లేదా ఆలస్యంగా జరుగుతుందా అను విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరాల లోపు జరిగే తొందరగా జరిగే వివాహంగా అనుకోవచ్చు.

1. లగ్నం మరియు సప్తమభామందు శుభగ్రహములు ఉండి సప్తమాధిపతి పాప గ్రహములతో కలవకుండా శుభ గ్రహముల దృష్టి పొందినను...
2. ద్వితీయ అష్టమ స్థానములందు శుభ గ్రహములు ఉన్నప్పుడు...
3. శుక్ర గ్రహ బలము ఉన్నప్పుడు అనగా మీనరాశియందుగాని, తుల, వృషభ రాశుల యందుండి రవికి 150 పైగా దూరంగా ఉన్నప్పుడు...
4. శుక్రునిపైన, చంద్రునిపైన శని యొక్క దృష్టి పడకుండా ఉన్నప్పుడు...
5. శుభగ్రహములు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు...
6. జలతత్వరాశులయందు శుభగ్రహములు ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది.

ఆలస్య వివాహములు అనగా 28 సంవత్సరాలు ఆపైన జరుగునవి.
1. లగ్నమందు సప్తమస్థానమందు పాపగ్రహములు అనగా శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహములు ఉన్నప్పుడు...
2. సప్తమ స్థానమందు రెండుగాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహములు ఉన్నప్పుడు...
3. ద్వితీయ, అష్టమభావముల యందు పాపగ్రహములు గాని, వక్రగ్రహములుగాని ఉన్నప్పుడు...
4. శుక్రుడు రాహువుతోగాని శనితోగాని కలిసియున్నప్పుడు...
5. శుక్రుడు రవిగ్రహమునకు 430 201 లకన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు...
6. జాతకంలో ఎక్కువ గ్రహములు నీచమందుగాని వక్రించిగాని ఉన్నప్పుడు...
7. సప్తమభావముపై మరియు సప్తమాధిపతిపై పాపగ్రహముల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.
ఈ విధముగా జాతకంలో శీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా? అని నిర్ణయించిన తరువాత జరుగుతున్న దశ, అంతర్ధశలను బట్టి గోచారములో గురువు, శుక్ర గ్రహములను బట్టి వివాహకాలము నిర్ణయించాలి. వివాహకాలము నిర్ణయించుటకు జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చు దశ, అంతర్ధశలను పరిశీలించాలి. సప్తమాధిపతి యొక్క లేదా సప్తమభావమును చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహము యొక్క దశ, అంతర్ధశలయందు వివాహము జరుగుతుంది. అలాగా నవాంశ లగ్నధిపతియొక్క లేదా సప్తమాధిపతి నవాంశయందున్న రాశి నాధుని యొక్క దశ అంతర్ధశలయందు వివాహం జరుగుతుంది.

ఈ విధముగా వివాహము జరుగు కాలమును నిర్ణయించిన తరువాత గురు గ్రహము యొక్క గోచార గమనమును బట్టి వివాహం జరుగు సంవత్సరము నిర్ణయించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు, అమ్మాయిల జాతకమందు కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరములో వివాహం జరుగుతుంది. ఉత్తరాయణకాలమందు జన్మించినవారికి నవాంశలో గురువు ఉన్న రాశిలో గాని గురువుకు 5, 9 స్థానములలోనికి గాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణమందు జన్మించినవారికి నవాంశలో శుక్రుడు ఉన్న రాశిలోనికి గాని, శుక్రునికి 5, 9 స్థానములలోనికి గాని గోచార రవి వచ్చిన నెలయందు వివాహం జరుగుతుంది.

ఈ విధముగా గురువు యొక్క సంచారమును బట్టి వివాహం జరుగు సంవత్సరము రవి యొక్క సంచారమును బట్టి వివాహం జరుగు నెల నిర్ణయించాలి. తదుపరి చంద్రుని యొక్క గమనముననుసరించి వివాహం జరిగే రోజు నిర్ణయించాలి. జాతకచక్రము పరిశీలించునప్పుడు ఆలస్య వివాహమునకు కారణం తెలుసుకొని తత్‌ సంబంధమైన గ్రహమునకు సంబంధించిన పరిహారములు చేసినచో దోషములు తొలగి శీఘ్రవివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని వివాహ సంబంధాలు చూసిననూ వివాహం జరుగదు. కొన్ని సందర్భములలో నిశ్ఛితార్ధం జరిగిన తరువాత వివాహం ముందు రోజు కూడా ఏవో కారణముల వలన వాయిదా పడుతుంటాయి. ఇటువంటివారు కనకదుర్గ అమ్మవారికి 8 శుక్రవారములు కుంకుమ అర్చన జరిపించినచో దోషములు తొలగిపోతాయి.

ముఖ్యంగా వివాహం తొందరగా కావాలని కోరుకునేవారు 8 మంగళవారములు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమలపాకులతో అర్చన జరిపించినచో వివాహం కుదురుతుంది. శనిగ్రహ దోషం వలన వివాహం ఆలస్యం అవుతుంటే తమలపాకులో తేనె పోసి నల్లచీమలకు ఆహారంగా ఉంచిన దోషం తొలుగుతుంది. వివాహం ఏదో ఒక కారణం వలన ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేయాలి.

‘‘దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రిభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయినీ’’

No comments:

Post a Comment