ఎంత ప్రయత్నించినా మనసు నా వశం కావడం లేదు. ఏం చెయ్యమంటారు?
- మేకా కృష్ణమూర్తి, జమ్మిగడ్డ
మనం ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. మన మనసుని వశపరచుకోవడం అనేది అర్థంలేని మాట. అయినా, ఈ మాటనే అందరూ అంటూ ఉంటారు. మనసుని వశపరుచుకోవాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. ఎన్నో సాధనలు చేస్తూంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. దీన్ని నేర్పడం అనే పేరుతో కొందరు కోట్లు సంపాదిస్తూంటారు.
ఒక పెన్నులాగ మన మనసు అచేతనమైంది. చైతన్యం లేని ఒక వస్తువును వశపరుచుకోవడానికి ప్రణాళికలు వేసి, అభ్యాసాలు చేయడం వెర్రితనం కాదా? 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః'- మనసే మనుషుల బంధానికి, మోక్షానికి కారణమవుతుంది అని పెద్దల సూక్తి. సంసార బంధానికి, విముక్తి(విడుదల)కి ఉపకరణంగా అంటే ఒక కత్తిలాంటి పనిముట్టుగా మనసు ఉంటుంది.
కత్తిలాగే మనసును ఉపయోగించుకోవడంలో మెళకువులు తెలియాలి. మనసును మన ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత కష్టసాధ్యం. ఇటువంటి మనసు విచిత్రంగా ఒక అచేతన పదార్థం. ఒక పెన్నుకు ఎలాగైతే సుఖ, దుఃఖాలు లేవో అలాగే మనసుకి కూడ సుఖ,దుఃఖాలు లేవు. అది అచేతనం కాబట్టి. ఆత్మకి, మనసుకి మధ్య ఉండే తేడాని మనం గమనించుకోలేకపోబట్టే మనకి వాస్తవ స్థితి తెలియడం లేదు.
మన(ఆత్మ)కి కలిగిన హాయిని, కలతని మనసుకు కలిగినట్లుగా మనం పొరబడుతూ ఉంటాం. ఆత్మకి మనసు పని ముట్టు. దానికి ఇది విధేయం. మనసు నేటి సెల్‌ఫోన్‌లాంటిది. మనమే దానికి ఎంత వశమైపోయి ఉన్నామో గదా! మనసు కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌లాంటిది. సాఫ్ట్‌వేర్ అచేతనమే. కాని చేతనంలా భాసిస్తుంది. మనసుకు ఒక ఆకారం లేదు. అది నీటి వంటిది. మన ఆలోచనల సమిష్టి రూపమే మనసు. దారాల అల్లికే వస్త్రం.
అలాగే మనసు. అందువల్ల మనం చేయాల్సిందల్లా మనలోని సత్త్వ గుణాన్ని పెంపు చేసుకోవడమే. ఈ సత్త్వగుణం చాలా వరకు మనం తినే ఆహారం మీద ఆధారపడుతుంది.
మన ఆహారమంటే బయటి విషయాల పట్ల మనకుండే ఆసక్తి, ఆలోచనలు, సంగం(అటాచ్‌మెంట్)కూడా. ఇవి తగ్గించుకుంటే, మన మనసు పనిముట్టు పదునెక్కుతుంది. పెన్ను బాగా రాస్తుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. జీవుడు దేవుడిని చేరుతాడు. జీవితం ధన్యం చేసుకుంటాడు. ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ
source: http://www.andhrajyothy.com/NivedanaNewsShow.asp?qry=2010/sep/14/nivedana/14nivedana1&more=2010/sep/14/nivedana/nivedanamain&date=9/14/2010
No comments:
Post a Comment